తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని స్థాపించే పనితో బిజీగా వున్నారు. త్వరలోనే పార్టీ పేరు కూడా ప్రకటించనున్నారని సమాచారం. అయితే అప్పుడే షర్మిలకు తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. టాలీవుడ్‌లోని స్టార్ యాంకర్లలో ఒకరైన శ్యామల మంగళవారం షర్మిలను కలిశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు తన భర్త నరసింహా రెడ్డితో కలిసి వెళ్లిన శ్యామల షర్మిలతో భేటీ అయ్యారు.
సుమారు పదిహేను నిమిషాల పాటు కొనసాగిన వీరి భేటీలో పలు విషయాలపై చర్చించారు. పార్టీ పెడితే తాము కూడా కండువా కప్పుకుంటామని శ్యామల దంపతులు షర్మిలకి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వీటిని ఖండించారు శ్యామల. ఫిబ్రవరి-10న షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పుట్టిన రోజు కావడంతో విషెస్ చెప్పడానికి లోటస్‌పాండ్‌కు వచ్చామని తెలిపారు. అయితే ఆ సమయంలో షర్మిలను కలవడం కుదరకపోవడంతోనే ఇప్పుడు కలిశామని యాంకర్ శ్యామల పేర్కొన్నారు
ఇది ఫ్రెండ్లీ మీట్ మాత్రమేనని.. అంతకు మించి ఏం లేదని ఆమె మీడియాకు తెలియజేశారు. తెలంగాణ రాజకీయాల్లోకి తన సొంత టీంతో వస్తున్న షర్మిల సక్సెస్ కావాలని శ్యామల ఆకాంక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. మహిళలందరికీ అడ్వాన్స్‌గా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ప్రస్తుతం శ్యామల యాంకర్‌గా, సినిమాల్లో ఆర్టిస్టుగా బిజీగా వుంటారు. ఆమె భర్త నరసింహా పలు తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. అయితే గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్యామల, ఆమె భర్త ఇద్దరూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో వీరిద్దరూ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. తాజాగా శ్యామల దంపతులు షర్మిలతో భేటీ కావడంపై ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.