వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి ఊహించని షాక్ తగిలింది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచింది మొదలు.. మళ్లీ తిరిగి ఏనాడూ నియోజకవర్గ పట్టభద్రులకు కన్పించిన దాఖాలాల్లేవు.
నిరుద్యోగ సమస్యను ఏనాడూ మండలిలో గానీ ప్రభుత్వం దృష్టికి గానీ తీసుకెళ్లిన సందర్భాలూ లేవు. దీంతో నిరుద్యోగుల నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈసారి భంగపాటు ఎదరౌతోంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నిజానికి ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తాయి. కానీ పల్లా విషయంలో సొంత టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ అధిష్టానం మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో పాటు నియోజకవర్గం, మండలాల వారీగా బాధ్యులను నియమించారు.
ప్రత్యేకంగా సోషల్ మీడియా సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు అడిగే సమయంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొంతమంది ఓట్లు అడిగితే.. కొట్టేంత పనిచేస్తున్నారు. అసలు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలో ఒక్క కారణం చెప్పడంటూ నిలదీస్తున్నారు.
దీంతో ఎమ్మెల్యేలే కాదు.. నియోజకవర్గ, మండలాల బాధ్యులు సైతం తలలు పట్టుకుంటున్నారు. పల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తమకు ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చిపెడుతోందని ఎమ్మెల్యేల వద్ద వాపోతున్నారు.